Yashwant Varma: దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో డబ్బు కలకలం! 4 d ago

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో పెద్ద మొత్తంలో డబ్బు బయట పడడం దేశవ్యాప్తంగా న్యాయవ్యవస్థ ప్రతిష్టకే మచ్చ తీసుకొచ్చింది. జస్టిస్ యశ్వంత్ వర్మను న్యాయపరమైన విధుల నుంచి తప్పిస్తూ ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రీ ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.
ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో పంజాబ్, హర్యానా హైకోర్టు చీఫ్ జస్టిస్ శీల్ నాగు, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ జీఎస్ సంధావాలియా, కర్నాటక హైకోర్టు జడ్జి జస్టిస్ అను శివరామన్ ఉన్నారు.
అసమర్థత, దుష్పవర్తన అనే కారణాలపై న్యాయమూర్తులను రాష్ట్రపతి పదవి నుంచి తొలగించవచ్చు. రాష్ట్రపతిని తొలగించిన పద్ధతిలోనే అంటే పార్లమెంట్ 2/3వ వంతు మెజార్టీతో తీర్మానం ఆమోదంతో పదవి నుంచి తొలగిస్తారు. న్యాయమూర్తులను పదవి నుంచి తొలగించే అభిశంసన తీర్మానాన్ని పార్లమెంట్ లోని ఏ సభలోనైనా ప్రవేశ పెట్టవచ్చు. న్యాయమూర్తులను పదవి నుంచి తొలగించే అభిశంసన తీర్మాన నోటీస్ పై లోక్ సభలో 100 మంది సభ్యులు, రాజ్యసభలో అయితే 50 మంది సభ్యులు సంతకాలు చేయాలి.
తీర్మానం ప్రవేశపెట్టే సభాపతికి 14 రోజుల ముందు నోటీసు ఇవ్వాలి. తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన సభాపతికి ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేస్తుంది. భారత రాజ్యాంగంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల తొలగింపు గురించి మాత్రమే పేర్కొన్నారు. 1968 జడ్జెస్ ఎంక్వెయిరీ యాక్ట్ లో న్యాయమూర్తుల తొలగింపు ప్రక్రియ గురించి వివరణాత్మకంగా పేర్కొన్నారు. పార్లమెంట్ సభ్యులు ఆయా సభల్లో అభిశంసన తీర్మాన నోటీసును సభాపతులకు అందజేసినప్పుడు సభాపతులు దానిని తిరస్కరించవచ్చు. న్యాయమూర్తులను తొలగించే ఈ పద్ధతిని అమెరికా నుంచి భారత రాజ్యాంగ గ్రహించింది.
ఏదైనా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. రాష్ట్రపతి నియమించిన న్యాయకోవిదులు. సుప్రీంకోర్టు జడ్జిలపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టి, పదవి నుంచి తొలగించాలంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 124, హైకోర్టు జడ్జిలను తొలగించాలంటే ఆర్టికల్ 218 ప్రకారం చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.
1991లో తమిళనాడుకు చెందిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి. రామస్వామిపై ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ లో పాల్గొనకపోవడం వల్ల 1993లో తగిన మెజార్టీ లేకపోవడంతో ఈ తీర్మానం వీగిపోయింది. కానీ తర్వాత రామస్వామి తన పదవికి రాజీనామా చేశారు.
దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా రాజ్యసభలో అభిశంసన తీర్మానం కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి సౌమిత్రా సేన్ పై ఆమోదించారు. ఈ తీర్మానం లోక్ సభలో ప్రవేశపెట్టక ముందే సేన్ తన పదవికి రాజీనామా చేశారు. న్యాయమూర్తుల అభిశంసనకు సంబధించిన కొన్ని కేసులను క్లుప్తంగా పరిశీలిస్తే.. జస్టిస్ పిడి దినకరన్, జస్టిస్ దీపక్ మిశ్రా (2018), జస్టిస్ సి.వి. నాగార్జున (2017), జస్టిస్ ఎస్.కె. గంగేలే (2015), జస్టిస్ సౌమిత్ర సేన్ (2011), జస్టిస్ వి. రామస్వామి (1993) ఇప్పటి వరకు అభిశంసనను ఎదుర్కొన్నారు.